పుట్టుకతో ఎవరూ గొప్పవారు కారు. కేవలం గొప్పవారింట పుట్టడం వల్లనే గొప్పతనం రాదు. స్వయంకృషి, పట్టుదల, మడమ తిప్పని ప్రయత్నం- మనిషిని మహనీయుణ్ని చేస్తాయి. కొన్ని సంస్కారాలు పుట్టుకతో వస్తాయి. అన్నీ అమరి ఉన్న కుటుంబంలో పుడితే, కొంత అదనపు బలం ఉంటుంది. అది చివరిదాకా ఉండి సహాయం చేయవచ్చు, చేయకపోనూ వచ్చు.
‘మధ్యలోనే సాధన ఆగిపోయి మరణిస్తే, ఆ సాధకుడు ఏమవుతాడు?’ అని అర్జునుడు శ్రీకృష్ణుణ్ని అడిగాడు. ‘ఏమీ నష్టం లేదు. అతడు చక్కటి కుటుంబంలో జన్మిస్తాడు. సాధనకు అనుకూలంగా ఉండే సత్సంప్రదాయ జన్మమెత్తుతాడు. అక్కడ సాధన కొనసాగిస్తాడు’ అని దేవదేవుడు భరోసా ఇచ్చాడు.
పుట్టుక తరవాత ఆగిపోయిన ఆధ్యాత్మికత, తిరిగి కొనసాగే అవకాశాలుంటాయి. మనిషి అసిధారావ్రతం వంటి ప్రయత్నం చేయాలి. ‘కృషితో నాస్తి దుర్భిక్షమ్’ అన్నారు పెద్దలు.
పేదరికంలో పుట్టవచ్చు కానీ, పేదరికంలోనే మరణించడం వెనక ఆ వ్యక్తి లోపమూ ఉంటుంది. తన గురించి తాను తెలుసుకోవాలి. తన జీవితాన్ని తానే మార్చుకోవాలన్న తపన ఉండాలి. ఆ మార్గంలో అతడు విశేషమైన కృషి సాగించాలి. తన భాగ్యాన్ని తానే మార్చుకోవాలి. తనను తాను బాగు చేసుకోవాలి. తన స్థానాన్ని, పుట్టుకలో ఉండే విశేషాన్ని గుర్తించాల్సింది మనిషే! పాకే గొంగళి పురుగుకు ఆ అవకాశం లేదు. బుసలు కొట్టే నాగుపాముకు ఆ అవకాశం లేదు. కారడవిలో సంచరించే చిరుత పులికి ఆ అవకాశం లేదు. అవి ఎలా పుడతాయో అలాగే ఉంటాయి. స్వభావాల్ని వదులుకోవు. బుద్ధిని వికసింపజేసుకునే ఏర్పాటు వాటికి లేదు. మనిషికి ఉంది.
కోడి రామ్మూర్తికి బలం- పుట్టగానే, శిశువుగా ఉండగానే రాలేదు. చార్లీ చాప్లిన్ నవ్వుతూ పుట్టలేదు. మదర్ థెరెసా ప్రార్థనా పూర్వకంగా చేతులు జోడించి జన్మించలేదు. బిల్ గేట్స్ పుట్టినప్పుడు డాలర్ల వర్షం కురవలేదు. అన్నప్రాశన సమయం నుంచే సింధు బ్యాడ్మింటన్ ఆడలేదు. తపన, కృషి వారిని ముందుకు నడిపించి గెలిపించాయి.
పుట్టుకతో కనిపించనివి ఆ తరవాత విస్తరిస్తాయి. సూర్యోదయం అనంతరం వెలుగులు విరజిమ్మినట్లు, కాలక్రమంలో లోకమంతటా అవి కీర్తి కిరణాల్ని వ్యాపింపజేస్తాయి. అలా అని, పీసీ సర్కార్ ఇంద్రజాలంలా, ఏవీ క్షణాలమీద జరిగిపోవు. పటిమ, అపజయాల్ని ఎదుర్కొనే మనస్తత్వం, విజయంపై అంతులేని విశ్వాసం వల్లనే అన్నీ లభిస్తాయి.
పుట్టుక- మనిషికి ఒక ఇంటిపేరును, మరో పేరును కట్టబెడుతుంది.కేవలం దానివల్లనే, ఎవరైనా చెట్టు పేరు చెప్పి కాయల్ని ఎంత కాలం అమ్మగలరు? ‘పాప పంకిలమైన బురద వంటి ఈ ప్రపంచంలో పద్మంలా వికసించాను. నాపేరు తథాగతుడు’ అని ప్రకటించాడు బుద్ధుడు. ఆయన జన్మరహస్యం తెలుసుకున్నాడు. దైవత్వం పొందాడు. దాన్ని నిరూపించినా, తాను దైవాన్ని అని చెప్పలేదు. చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయాడు.
పరలోకంలో ఉన్న దశరథుడు- రావణుడి మరణం తరవాత భూమిపైకి వస్తూ, ఆకాశంలో ఆగి శ్రీరాముణ్ని చూశాడంటున్నాయి పురాణ గాథలు. ఆయన ఆనందంతో చేతులు జోడించాడట. అదీ, రామపుట్టుకలోని వైభవం!
హిరణ్య కశిపుణ్ని తన నఖ క్షతాలతో చీల్చి సంహరించాడు నృసింహుడు. అనంతరం, అక్కడ బాలుడైన ప్రహ్లాదుణ్ని ఆ భగవానుడు అత్యంత ప్రేమగా చూశాడట. అదీ, కారణజన్ముడైన హరిభక్తుడు ప్రహ్లాదుడి జన్మ విశేషం!
పుట్టడం ఒకెత్తు. ఆ పుట్టుకను సార్థకం చేసుకోవడం మరొకెత్తు. అందరూ పుడతారు. జనాభా జాబితాలో పేరున్నంతమాత్రాన సరిపోదు. ఏదోవిధంగా బతకడం గొప్ప కాదు. జీవితంలో కృతార్థత సాధించాలి. తాజ్మహల్ ఒకటే ఉంది. నయాగరా జలపాతం ఒకటే ఉంది. వాటి గురించి నలుగురూ అనుకునే మాటలే శాశ్వతత్వాన్ని కలిగిస్తాయి. వాటి కీర్తిని చిరస్థాయిగా నిలబెడతాయి!

