రామకృష్ణ పరమహంస కథలు - దేవుడు ఒక్కడే! పేర్లు అనేకం!-(చెరువు - నాలుగు ఘట్టాలు)

ఒకసారి రామచంద్రదత్త, బ్రహ్మ సమాజంలో ఉండే లోపాలను గురించి మాట్లాడటం మొదలు పెట్టాడు. అప్పుడు గురుదేవులు ఇలా చెప్పారు:

“ఒక చెరువు ఉంది. దానికి అనేక ఘట్టాలున్నాయి. ఒక ఘట్టంలో నుంచి హిందువులు బిందెలతో నీళ్ళు తీసుకుపోతున్నారు. 'ఆ బిందెల్లో ఏముంది?' అంటే ‘జలం!' అని బదులు చెప్పారు. ఇంకో ఘట్టంలో నుంచి మహమ్మదీయులు తోలుతిత్తుల్లో నీళ్ళు తీసుకుపోతున్నారు. 'ఆ తిత్తుల్లో ఏముంది?' అంటే 'పానీ! అని వాళ్ళు సమాధానం చెప్పారు. ఇంకో ఘట్టంలో నుంచి క్రైస్తవులు బక్కెట్లతో నీళ్ళు తీసుకుపోతున్నారు. 'ఆ బక్కెట్లలో ఉన్నది ఏమిటి?” అని అడిగితే 'వాటర్!” అని వాళ్ళు చెప్పారు.”


“చూడండి! ఆ నీళ్ళు తెస్తున్న వాళ్ళలో ఎవరైనా అది 'జలం' కాదు 'పానీ' అని అన్నా, 'పానీ' కాదు 'వాటర్' అన్నా, అది హాస్యాస్పదంగా ఉండదా? వివిధ సంప్రదాయాల మధ్య ఘర్షణలకు, అపార్థాలకు, తగాదాలకు ఇదే కారణం. దీనివల్లనే మానవులు మతాల పేర్లతో ఒకరినొకరు పొడుచుకొని చంపుకుంటున్నారు. రక్తపాతం చేస్తున్నారు. ఇది ఎంతమాత్రం సమంజసమైన పని కాదు. నిజానికి ప్రతివారు దేవుని వైపే పురోగమిస్తున్నారు. హృదయంలో వ్యాకులత, నిజాయితీ ఉన్నట్లయితే వాళ్ళు దేవుణ్ణి దర్శిస్తారు,” అని చెప్పి ఇంకా ఇలా అన్నారు:

“మతాలను గురించి బోధించేవాళ్ళు ఒకరితో ఒకరు కొట్లాడుకోవడం నేను కళ్ళారా చూశాను. హిందువులు, క్రైస్తవులు, ముసల్మానులు, బ్రహ్మసమాజంవారు, శాక్తేయులు, వైష్ణవులు, శైవులు - ఒకరేమిటి - అందరూ ఒకరితో ఒకరు పోట్లాడుకుంటున్నారు. ఎవడు కృష్ణుడో-వాడే శివుడు! అతడే 'ఆద్యాశక్తి' అనీ, 'జీసస్' అనీ, 'అల్లా' అనీ పిలువబడుతున్నాడనే జ్ఞానం వారికి లేదు. 'ఏక్ రామ్ - హజార్ నామ్! దేవుడు ఒక్కడే. కానీ ఆయన అనేక పేర్లతో పిలువబడుతున్నాడు."

“సత్యం ఒక్కటే! అదే అనేక పేర్లతో వ్యవహరించబడుతున్నది. అందరూ అన్వేషించేది ఆ సత్యాన్నే! వాతావరణం, స్వభావాలు, పేర్లు మొదలైనవే భిన్నంగా కనపడడానికి కారణం. అందువల్ల తమ మతమే సరైనదని, ఇతరుల మతాలు సరైనవి కావని అనుకోవడం ఎంతమాత్రం పనికిరాదు. ఉన్న భగవంతుడు ఒక్కడే. రెండు ఎన్నటికీ కాదు. ఏకమేవాద్వితీయం బ్రహ్మా”


రామకృష్ణ పరమహంస కథలు - దేవుడు ఒక్కడే! పేర్లు అనేకం!-(చెరువు - నాలుగు ఘట్టాలు)