ఈ స్థూలశరీరంలో మనస్సు ఒక సూక్ష్మమైన భాగం. ఈ భౌతికమైన స్థూలశరీరం మనస్సుకు పైన ఉండే ఒక పొర మాత్రమే. మనస్సు శరీరంలోని ఒక సూక్ష్మమైన అంశం కనుక ఇవి రెండూ ఒకదానినొకటి ప్రభావితం చెయ్యగలవు. ఈ కారణం వల్లనే శరీరానికి కలిగిన అనారోగ్యం మనస్సును, మనస్సుకు కలిగిన అనారోగ్యమూ, ఒత్తిడీ, శరీరాన్నీ ప్రభావితం చేస్తాయి.
ఈ మనస్సుకు వెనుక ఆత్మ ఉంది. అదే మనిషి యొక్క నిజతత్త్వం. శరీరం, మనస్సు పదార్థాలు; ఆత్మ శుద్ధశక్తిస్వరూపం. మనస్సు, ఆత్మ ఒకటి కావు. ఈ రెండూ వేరువేరు. దీనిని వివరించడానికి ఒక ఆధునిక శాస్త్ర ఉపమానాన్ని తీసుకుందాం. మనస్సు,
శరీరాల మధ్య గల తేడా వాటి కంపన స్థితిలోని తేడా మాత్రమే. తక్కువ కంపనస్థితిని కలిగి ఉంటే దాన్ని శరీరం అని, ఎక్కువ కంపనస్థితి కలిగిన దాన్ని మనస్సు అని అంటారు. శరీరం, మనస్సు - ఈ రెండూ ఒకే విధమైన కాల, కారణ, పదార్థ నియమాలకు లోబడి పనిచేస్తాయి.
పదార్ధాన్ని మనస్సుగా మార్చవచ్చు. బహుశా మనం దీన్ని గమనించి ఉండకపోవచ్చు. ఉదాహరణకు రెండువారాలపాటు ఆహారం తీసుకోని వ్యక్తిని చూడండి. అతనికి ఏమవుతుంది? అతని శరీరం నీరసించి పోవడమే కాక, అతని మనస్సు కూడా ఖాళీ అయిపోతుంది. అతడు మరికొన్ని రోజులు ఉపవాసం చేస్తే కనీసం ఆలోచించడం కూడా అతనికి కష్టమవుతుంది. అతని పేరే అతనికి గుర్తుండదు. అతడు మళ్ళీ ఆహారం తీసుకోవడం ప్రారంభిస్తే క్రమంగా అతని శరీరం శక్తిని పుంజుకుంటుంది. జ్ఞాపకశక్తి మరలా వస్తుంది. కాబట్టి పదార్థరూపమైన ఆహారం మనస్సుగా మారుతుందన్నమాట.
ఉద్దాలకుడు తన కుమారుడైన శ్వేతకేతువుకి ఆహారం ఏ విధంగా మనస్సుగా మారుతుందో ప్రయోగపూర్వకంగా నిరూపించిన వైనాన్ని మనం ఉపనిషత్తులలో చదువవచ్చు. ఆ రెండు అధ్యాయాలనూ, వాటికి సంబంధించిన బోధనలనూ ఇప్పుడు తెలుసుకుందాం:
“కుమారా! పెరుగును చిలికినప్పుడు దానిలోని సూక్ష్మమైన పదార్థం పైకి లేచి వెన్నగా ఏర్పడుతుంది. అదే విధంగా, మనం తిన్న ఆహారంలోని సూక్ష్మాతిసూక్ష్మమైన అంశం పైకి లేచి మనస్సుగా ఏర్పడుతుంది. నాయనా! ఆ విధంగా, మనస్సు ఆహారంచేత, ప్రాణం నీటి చేత, వాక్కు అగ్ని చేత ఏర్పడతాయి".
హిందూ దృక్పథంలో మనస్సుయొక్క స్వభావం 29 కుమారుడైన శ్వేతకేతువు ఇలా అన్నాడు: “మహాత్మా! దయచేసి నాకు ఇంకా బోధించండి!"
“అయితే విను! ఒక మనిషిలో పదహారు భాగాలుంటాయి. పదిహేను రోజులు (ఎటువంటి ఆహారం) తినవద్దు. కానీ నీకు కావలసినంత నీరు త్రాగు. ప్రాణం నీటి వలన కలుగుతుంది కాబట్టి నీరు త్రాగుతూ ఉంటే ప్రాణం పోదు”..
తండ్రి ఆజ్ఞ మేరకు శ్వేతకేతువు పదిహేను రోజులు ఏ ఆహారం తినలేదు. అప్పుడు తన తండ్రి వద్దకు వచ్చి, “తండ్రీ! నన్ను ఏమి వల్లించమంటారు?" అన్నాడు. ఉద్దాలకుడు: “ఋక్, యజుర్, సామ వేదాలను వల్లించు!"
శ్వేతకేతువు: “అవి నాకు గుర్తుకు రావడం లేదు" (అతడు వేదాలను జ్ఞాపకం చేసుకోలేకపోయాడు),
ఉద్దాలకుడు: “కుమారా! బ్రహ్మాండమైన అగ్ని మండిపోగా మిగిలిన, మిణుగురు పురుగు పరిమాణం కలిగిన నిప్పుకణిక ఎక్కువగా జ్వలించే శక్తిని కలిగి ఉండదు. అదే విధంగా నీలోని పదహారు భాగాలలో మిగిలిన ఒక భాగంవల్ల నీకు వేదాలు గుర్తుకు రావు. ఇప్పుడు ఆహారం తీసుకో! నేను చెప్పినది నీకు అర్థం అవుతుంది."
శ్వేతకేతువు ఆహారం తీసుకుని తిరిగి తండ్రి వద్దకు వచ్చాడు. అప్పుడు తండ్రి ఏది అడిగినా వల్లించగలిగాడు.
ఉద్దాలకుడు: “కుమారా! బ్రహ్మాండమైన అగ్ని మండిపోగా మిగిలిన, మిణుగురు పురుగు పరిమాణం కలిగిన, నిప్పుకణికను మళ్ళీ గడ్డివేసి ఏ విధంగా మండించవచ్చో, నీలోని పదహారు భాగాలలో మిగిలిన ఒక భాగాన్ని ఆహారాన్ని అందించడం ద్వారా తిరిగి జ్వలింపజేయవచ్చు. దానివల్లనే నీవు వేదాలను జ్ఞాపకం చేసుకోగలిగావు.
కాబట్టి, కుమారా! మనస్సు ఆహారం నుంచి, ప్రాణం నీటి నుంచి, వాక్కు అగ్ని నుంచి ఏర్పడతాయి”.
అప్పుడు శ్వేతకేతువుకు తండ్రి చెప్పినది అర్థం అయింది.
పై బోధనను అనుమానించే వారెవరైనా ఉంటే వాళ్పు పదిహేను రోజులు నీటిని మాత్రమే తీసుకుంటూ ఉపవాసం చేసి తమ మనస్సులకు ఏమి జరుగుతుందో తెలుసుకోవచ్చు!

