“మానవుడు దేనినైతే వెతుకుతున్నాడో అది అతడికి అతి సమీపంలోనే ఉంది. ఐనా అతడు దానిని అక్కడాయిక్కడా వెతుకుతుంటాడు.”
“ఒకడు చుట్ట కాల్చుకోవాలని అనుకున్నాడు. నిప్పు కోసం పొరుగింటికి వెళ్ళాడు. అది అర్ధరాత్రి అవడంవల్ల అందరూ గాఢనిద్రలో మునిగి ఉన్నారు. వాడు మొదట పిలిచాడు. తలుపు తట్టాడు. ఎవరూ పలుకలేదు. తరువాత తలుపుని బాదడం మొదలు పెట్టాడు.
ఆ శబ్దానికి లేచి లోపలి నుంచి ఎవరో వచ్చి తలుపుతీసి చూచారు. ఎదురుగా ఈ మనిషి కనపడ్డాడు. అతణ్ణి చూడటంతోనే, 'ఏమిటండీ! సంగతేమిటి? ఇంత రాత్రివేళ ఇలా వచ్చారు?' అని ప్రశ్నించారు. ఆ ధూమపానప్రియుడు వెంటనే, 'ఆ మాత్రం ఊహించలేవటయ్యా! చుట్ట కాల్చటమంటే నాకెంత ప్రాణమో నీకు తెలియదా? అందుకే చుట్ట వెలిగించుకోవడానికి నిప్పు అడుగుదామని వచ్చాను” అని బదులు చెప్పాడు. అప్పుడు ఆ పొరుగువాడు బిగ్గరగా నవ్వుతూ, “మీరు భలేవారండీ! దీని కోసమేనా ప్రయాసపడి ఈ అర్ధరాత్రి ఇంతదూరం వచ్చి తలుపు బాదుతూ ఉన్నారు? వెలుగుతున్న లాంతరు మీ చేతిలోనే ఉంది కదా!' అన్నాడు."
ఈ కథను శ్రీరామకృష్ణులు పెద్దగోపాలుడు మొదలైన శిష్యులకు చెప్పారు. పెద్దగోపాలుడు తరువాత గురుదేవుల వద్ద సన్యాసం తీసుకొని, అద్వైతానంద స్వామి అనే పేరుతో ప్రసిద్ధి కెక్కారు. శ్రీరామకృష్ణులు ఇంకా ఇలా చెప్పి ముగించారు: “దేవుడు 'అక్కడ, అక్కడ' (అంటే ఎక్కడో ఎంతో దూరంలో) ఉన్నాడని తలుస్తున్నంతవరకూ మానవుడు అజ్ఞానంలో ఉంటాడు. భగవంతుడు “ఇక్కడ, ఇక్కడ' (అంటే తనలోనే) ఉన్నాడని తెలుసుకుంటే జ్ఞానాన్ని పొందినవాడౌతున్నాడు.”
దీనితోపాటు మన హృదయంలోనే దేవుడు ఉన్నాడన్న భావనను వివరించే ఈ కథను కూడా ఆయన చెప్పారు.
“ఒక ముసల్మాను, తన ప్రార్థనలను చేస్తూ, “ఓ అల్లా! ఓ అల్లా!' అని బిగ్గరగా అరవసాగాడు. దగ్గరలోనే నిలబడివున్న మరొక ముసల్మాను, “నీవు అల్లాను సంబోధిస్తున్నావు. చాలా బాగుంది. కానీ అలా అరుస్తావెందుకు? ఆయన చీమ కాలి అందెల సవ్వడి కూడా వినగలడని నీకు తెలియదా?' అని ప్రశ్నించాడు."
“భగవంతుడిలో మన మనస్సు ఐక్యం చెందినప్పుడు, ఆయనను అతి సమీపంలో, మన హృదయంలోనే దర్శిస్తాము.”

