భగవంతుడు అన్ని జీవరాశులలోనూ ఉన్నాడు
(మావటివాడూ నారాయణుడే)
భగవంతుడు అన్ని జీవరాశులలోనూ ఉన్నా, ఆయన తేజస్సు వేరువేరు జీవులలో వేరువేరుగా వ్యక్తమవుతుంది. దీనిని వివరిస్తూ శ్రీరామకృష్ణులు ఇలా చెప్పారు.
“ఒక కథ చెపుతా విను! ఒక అడవిలో ఒక సాధువు ఉన్నాడు. అతడికి చాలామంది శిష్యులున్నారు. ఒకరోజు ఆయన, 'భగవంతుడు అన్ని జీవరాశులలోనూ ఉన్నాడు. అందువల్ల ఆ జీవరాశులలో ఉన్న భగవంతుడికి నమస్కరించాలి' అని వారికి బోధించాడు.”
"ఆ శిష్యులలో ఒకడు అగ్నిహోత్రానికి సమిధలు తేవడానికి అడవికి వెళ్ళాడు. అకస్మాత్తుగా అతడికి, 'అడ్డం తొలుగు! ప్రక్కకు తప్పుకో! మదపుటేనుగు వస్తున్నది!' అనే కేక వినపడింది. ఆ కేక విని అందరూ పారిపోతున్నారు. కాని ఆ శిష్యుడు, 'ఈ ఏనుగు కూడా భగవంతుడి యొక్క వేరొక రూపమే కదా! నేను ఇక్కడ నుండి ఎందుకు పారిపోవాలి?' అనుకున్నాడు. అతడు అక్కడే నిలబడి, తలవంచి ఆ ఏనుగుకు నమస్కరించి, దాని గుణగణాలను కీర్తించటం
మొదలు పెట్టాడు. మావటివాడు, 'ఏయ్, పారిపో! పారిపో!' అని బిగ్గరగా అరిచాడు. అయినా ఈ శిష్యుడు కదలడే! ఆ ఏనుగు అతణ్ణి తొండంతో పట్టుకుని ఒక ప్రక్కకు విసిరివేసింది. అతడికి దెబ్బలు తగిలి, స్పృహతప్పి పడిపోయాడు. గురువుగారికి ఈ సంగతి తెలిసి కొందరు శిష్యులతో అక్కడికి వచ్చి అతణ్ణి ఆశ్రమానికి చేరవేశారు. చికిత్స చేసిన కొంతసేపటికి ఆ శిష్యుడికి తెలివి వచ్చింది. శిష్యులలో ఒకడు, “ఏమయ్యా! ఏనుగు వస్తోందని తెలిసి కూడా నీవు అక్కడ నుండి ఎందుకు తొలగలేదు?” అని ప్రశ్నించాడు. దానికి అతడు, 'మన గురువుగారు భగవంతుడే మానవులుగాను, జంతువులుగాను ఎన్నో రూపాలు ధరించాడని చెప్పారు కదా! అందుకే ఏనుగు రూపంలో దేవుడు వస్తున్నాడని నేను
ప్రక్కకు తొలగలేదు' అని బదులు చెప్పాడు. వెంటనే గురువుగారు అందుకొని, 'నిజమే నాయనా! 'ఏనుగు-దేవుడు' రావటం యథార్థమే. కాని 'మావటి -దేవుడు' పారిపొమ్మన్నాడు కదా! అన్ని జీవులు దేవుని రూపాలే అయినప్పుడు ఆ
మావటి-దేవుని మాటలు ఎందుకు చెవిని పెట్టలేదు? నీవు ఆ మావటి-దేవుని మాట విని ఉండాల్సింది' అన్నాడు.”
“శాస్త్రాలలో నీరు నారాయణ స్వరూపమని చెప్పబడింది (ఆపో నారాయణః). కొన్ని నీళ్ళు శుభ్రంగా ఉండి, పూజకు పనికి వస్తాయి. కొన్ని నీళ్ళు స్నానానికి, మరికొన్ని నీళ్ళు అంట్లు తోమడానికి, గుడ్డలు ఉతకడానికి మాత్రమే పనికివస్తాయి. త్రాగడానికి కానీ, పూజకు కానీ పనికిరావు. అదే విధంగా భగవంతుడు పాపాత్ముల రూపంలోను, పుణ్యాత్ముల రూపంలోనూ, మంచివాడిగాను, చెడ్డవాడిగాను, ఇంకా అనేక రూపాలుగాను, ఉండటంలో సందేహం లేదు. కాని చెడ్డవారితోను, పాపాత్ములతోను, దుష్టులతోను సంబంధం పెట్టుకోకూడదు. వారితో సన్నిహితంగా ఉండకూడదు. కొందరితో 'ఓహో' అంటే 'ఓహో' అనాలి. మరికొందరితో అలా ఉండటం కూడా పనికిరాదు. అటువంటి వారికి దూరంగానే ఉండాలి.”
“అంతేకాకుండా భగవంతుడు అన్ని జీవరాశుల్లోనూ ఉన్నాడు. అయినా సత్పురుషులతో సన్నిహితంగా ఉండి, దుష్టులకు దూరంగా ఉండాలి. పులిలో దేవుడున్నాడని పులిని కౌగలించుకోవు కదా! 'పులిని చూచి ఎందుకు పారిపోవాలి. దానిలో కూడా దేవుడు లేడా?' అనవచ్చు. కాని, 'పారిపో!' అని చెప్పేది కూడా భగవంతుని విభూతియే (రూపమే) కదా! వారి మాటలు ఎందుకు వినకూడదు?”
