సురేంద్రనాథ్ మిత్ర గురుదేవుల గృహస్థభక్తులలో ముఖ్యుడు. ఒకసారి అతడు గురుదేవులను గురించి వ్యంగ్యంగాను, పరుషంగాను మాట్లాడాడు. ఆ విషయం గురుదేవులకు తెలిసింది. గురుదేవులు ఆ విషయాన్ని ఆధార సేను మొదలయిన భక్తుల సమక్షంలో ప్రస్తావించి ఇలా అన్నారు: “ఎవరు ఆ సురేంద్రుడు? ఒక జంపకాణ, కొన్ని దిండ్లు, నాలుగు రూపాయలు నాకు ఇచ్చినంత మాత్రాన ఇంత నిర్లక్ష్యంగా మాట్లాడతాడా? అలా మాట్లాడడానికి అతడికి ఎన్ని గుండెలు?” అని అంటూ ఆధారుని ఉద్దేశించి, “ఒక కథ చెపుతా విను!” అన్నారు.
“ఒక బాలసన్న్యాసి ఒకరోజు భిక్షాటనకు వెళ్ళాడు. ఒక గృహస్థుని ఇంటి ముందు నిలబడ్డాడు. ఆ ఇంట్లో నుండి యౌవనంలో ఉన్న ఒక యువతి వచ్చి ఈ సన్న్యాసికి భిక్ష వేసింది. ఆ సన్న్యాసి ఆ అమ్మాయి తల్లితో, 'అమ్మా! ఈ అమ్మాయి గుండెల మీద కురుపులు లేచినవా ఏమిటి?' అని ప్రశ్నించాడు. ఆమె ఆ బాలసన్న్యాసి అమాయకత్వాన్ని గ్రహించి, 'లేదు నాయనా! ఈ అమ్మాయికి పిల్లలు కలిగినపుడు ఆ పిల్లలకు పాలిచ్చి పెంచి పెద్దవారిని చెయ్యటానికి భగవంతుడు ఆమెకు పాలిండ్లు ప్రసాదించాడు' అని బదులు చెప్పింది. ఆ మాట విన్న ఆ బాలసన్యాసి విస్మయంతోను, సంతోషంతోనూ, తృప్తితోనూ, 'అలా అయితే ఈ భిక్ష కోసం నేనెందుకు బాధపడాలి? భిక్షాటనానికి ఇతరుల దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? నన్ను ఏ భగవంతుడు సృష్టించాడో ఆ భగవంతుడే నాకు పట్టెడు అన్నం పెట్టి రక్షించడా?' అనుకుంటూ వెళ్ళిపోయాడు.”
“కాబట్టి భగవంతుణ్ణి నమ్ముకున్న భక్తులకు కావలసినవన్నీ భగవంతుడే సమకూరుస్తాడు. వాళ్ళకు ఏ కొరత ఉండదు. ఎవరు తమ హృదయంలో భగవంతుణ్ణి ప్రతిష్టించుకున్నారో, ఆ మహాత్ములకు సేవ చేయడానికి ఎంతోమంది ముందుకు వస్తారు. కాశీలో ఉన్న కొందరు సాధువులను చూచాను. ఎంతోమంది సంపన్నులు చేతులు కట్టుకుని వాళ్ళముందు నిలబడి వారి ఆజ్ఞల కోసం వేచి ఉంటారు. వారికి సాధువులంటే అంత భక్తి ఉంది. కాని నిజమైన సాధువు దేనినీ కోరడు. అతడికి ఏ లోటూ ఉండదు. భగవత్సాక్షాత్కారానికి కావలసినదంతా ఆ భగవంతుడే అతడికి సమకూరుస్తాడు.”

