స్వప్రయత్నము - దైవకృప (నారదుడు - నరకము)
ఒకరోజు శ్రీరామకృష్ణుల భక్తులలో ఇద్దరికి స్వప్రయత్నము-దైవకృప అనే రెండు భావాలకూ సమన్వయం కుదరక గురుదేవుల వద్దకు వెళ్ళ ఆయనను ప్రశ్నించారు. గురుదేవులు వారితో మాట్లాడుతూ ఈ విధంగా చెప్పారు: స్వప్రయత్నం గురించి ఎందుకు మాట్లాడతారు? ప్రతీది భగవంతుని సంకల్పం మీదే ఆధారపడి ఉంటుంది.
ఒక ఆవును పలుపు తాడుతో గుంజకు కట్టినట్లుగా మన సంకల్పం కూడా భగవంతుని సంకల్పానికి ముడివేయబడి ఉన్నది. మనిషికి కొంత స్వాతంత్ర్యo తప్పక ఉంది. అంతవరకు తాను స్వప్రయత్నంతో కృషి చేయగలడు. కానీ, ఈ పలుపు తాడు ఎంత పాడవు ఉందో అంతవరకు మాత్రమే - ఆవు తిరగగలిగినట్టుగా, మనిషి స్వతంత్రం కూడా కొంతవరకే ఉంటుంది. అంతమాత్రంతోనే తాను సర్వస్వతంత్రుడ్డి అని మనిషి అనుకుంటాడు. కానీ నిజానికి అతని సంకల్పము , ఆలోచనా పరిధి అంతా కూడా దైవసంకల్పము పైనే ఆధారపడి ఉంటుంది" అని చెప్పాడు.
“అలా అయితే జపతపధ్యానాదుల అవసరమేమీ లేదా? మనిషి హాయిగా కూర్చుని, అన్నీ ఆయన ఇష్టప్రకారం జరుగుతున్నాయని అనుకోవచ్చు కదా?” అని వారు ప్రశ్నించారు. .
దానికి గురుదేవులు, “ఇన్ని మాటలు మాట్లాడి ఏమిటి ప్రయోజనం? ముళ్ళ మీద చెయ్యి పెడితే ముళ్ళు గుచ్చుకుంటాయి. ముళ్ళకంప మీద చెయ్యి పెట్టి, 'ముళ్ళులేవు-ముళ్ళులేవు' అని ఎంత బింకంగా పలికినా అవి గుచ్చుకోకా మానవు! నొప్పి కలుగక మానదు! మనిషి తన సొంతశక్తితోనే అంతా సాధించగలిగితే అందరూ దైవసాక్షాత్కారాన్ని సాధించి ఉండేవారు కదా! కానీ అలా జరగడం లేదు. ఎందుకో ఆలోచించండి!”
“భగవంతుడు తనకు ఇచ్చిన శక్తిని మనిషి సరిగా ఉపయోగించుకోకపోతే, ఆయన అంతకు మించి మనకు శక్తిని ఇవ్వడు. ఇది మాత్రం నిజం! అందువలననే స్వయంకృషి అనేది అవసరం. స్వయంకృషితో దైవానుగ్రహానికి అర్హతను పొందాలి. స్వయంకృషి, దైవకృప కలిసినప్పుడు అనేక జన్మల బాధలన్నీ ఒక జన్మలోనే అనుభవించవచ్చు. కాబట్టి ఎంతోకొంత స్వప్రయత్నం తప్పనిసరి. ఈ విషయానికి సంబంధించి, ఒక కథ చెపుతా వినండి!”
“ఒకసారి విష్ణువుకు ఎందుకో కోపం వచ్చి, నారదుణ్ణి నరకంలో పడమని శపించాడు. నారదుడు చాలా కలతపడి, నరకం ఎక్కడ ఉందో చూపించమని, అక్కడకు ఎలా వెళ్ళాలో తెలియచేయమని విష్ణుమూర్తినే మరీమరీ ప్రార్థించాడు. విష్ణుమూర్తి ఒక సుద్దముక్కతో నేలపైన విశ్వం యొక్క చిత్రపటాన్ని గీసి దానిలో స్వర్గం, నరకం ఎక్కడ ఉంటాయో స్పష్టంగా గుర్తు పెట్టి చూపించాడు. నారదుడు ఆ పటంలో నరకం ఉన్న ప్రదేశాన్ని చూపించి, 'ఇదే కదా నరకం? మీరు చెపుతున్నారు కనుక ఇది కచ్చితంగా నరకమే!' అని, ఆ ప్రదేశంలో నేలమీద పడి, అటూ ఇటూ పొర్లి, తాను నరకబాధలన్నీ అనుభవించేసినట్టేనని చెప్పాడు. విష్ణుమూర్తి చిరునవ్వుతో, 'అదెలా కుదురుతుంది?' అని అడిగాడు. నారదుడు, ప్రభూ! స్వర్గము, నరకము మీ సృష్టి కదా! మీరే ఈ బొమ్మ గీసి దానిలో నరకాన్ని చూపించారు కదా! కాబట్టి అది నిజంగా నరకమే అవుతుంది. నిజానికి ఆ ప్రదేశంలో నేను పొర్లుతున్నప్పుడు నాకు విపరీతమైన బాధ కలిగింది. అందుచేత నరకంలోని శిక్షలన్నీ అనుభవించినట్లే!” అన్నాడు. ఈ మాటలను నారదుడు ఎంతో నిజాయితీతో చెప్పాడు. అది విని విష్ణుమూర్తి సంతృప్తి చెందాడు." నారదుడు ఆ చిత్రపటం ఉన్న ప్రదేశంలో పొర్లడాన్నీ, విపరీతమైన బాధలను అనుభవించడాన్నీ స్వప్రయత్నంతోనూ, విష్ణువు సంతృప్తి చెందడాన్ని దైవకృపతోనూ పోల్చవచ్చు.

