జ్ఞాన భక్తి - ప్రేమ భక్తి -ముగ్గురు స్నేహితులు - పెద్దపులి

జ్ఞాన భక్తి - ప్రేమ భక్తి
(ముగ్గురు స్నేహితులు - పెద్దపులి) 

ఒకసారి శ్రీరామకృష్ణులు రామచంద్రదత్త ఇంటికి వెళ్ళారు. ఆ సందర్భంగా రామచంద్రదత్త ఒక పౌరాణికుణ్ణి పిలిచి భాగవత కాలక్షేపం ఏర్పాటు చేశాడు.
పురాణకాలక్షేపం పూర్తి అయిన తరువాత ఒక భక్తుడు గురుదేవులను, 'ప్రేమభక్తి గొప్పదా? జ్ఞానభక్తి గొప్పదా?' అని ప్రశ్నించాడు. దానికి సమాధానం చెపుతూ గురుదేవులు, 'భగవంతుణ్ణి ప్రేమించి, ఆయన మన సొంతం అని అనుకుంటే తప్ప భగవంతుని యందు ప్రేమభక్తి జనించదు. ఒక కథ చెపుతా విను!' అని ఈ కథను చెప్పారు.
“ఒకసారి ముగ్గురు స్నేహితులు కలిసి అడవిలో నుంచి వెడుతున్నారు. ఆ సమయంలో అకస్మాత్తుగా ఒక పెద్దపులి ఎదురుగా వచ్చింది. దానిని చూచి భయపడి వారిలో ఒకడు, 'మిత్రులారా, మనకు కాలం తీరిపోయింది. మనమిక
బ్రతకం!” అని అరిచాడు. వెంటనే రెండవవాడు, 'ఫర్వాలేదు, రండిరా! మనకాలం తీరలేదు, ఏమీ కాలేదు. మనందరం కలిసి భగవంతుణ్ణి ప్రార్థిద్దాం!' అన్నాడు. ఇంతలో మూడవవాడు అందుకొని, 'మిత్రులారా! మనం భగవంతుణ్ణి ఎందుకు కష్టపెట్టాలి? ఇదిగో ఇక్కడే ఉన్న ఈ చెట్టు ఎక్కి ప్రాణాలు రక్షించుకుందాం!” అన్నాడు.” “మనకాలం తీరిపోయింది” అని గగ్గోలు పెట్టిన వాడికి, 'భగవంతుడనేవాడు ఒకడున్నాడు, వాడు మనల్ని రక్షిస్తాడు' అనే విషయమే తెలియదు. ఇక 'భగవంతుణ్ణి ప్రార్థిద్దామన్న' రెండవవాడు జ్ఞానభక్తి కలవాడు. భగవంతుడు ఒకడున్నాడని, అతడు సర్వవ్యాపి అని, ప్రపంచాన్ని, మనను అతడు సృష్టించి పోషిస్తాడని వాడికి తెలుసు. ఇక 'చెట్టెక్కి ప్రాణం రక్షించుకుందాం; భగవంతుణ్ణి మనం ఎందుకు కష్టపెట్టాలి' అన్న మూడవవాడు ప్రేమభక్తి కలవాడు. వాడికి భగవంతునియందు గాఢమైన ప్రేమ వుంది. అటువంటి ప్రేమ స్వభావం భగవంతుని కంటే తానే బలవంతుడనని భక్తుడు విశ్వసించేలా చేస్తుంది. వాడు ఎల్లప్పుడూ, తన ప్రియసఖుడైన భగవంతుడికి ఎక్కడ నొప్పి కలుగుతుందో అన్న మెలకువతో ఉంటాడు. తన ప్రియుడికి ఏ విధమైన బాధ కలుగకూడదన్నదే అతడి ఏకైక జీవితలక్ష్యము. తన ప్రియుడికి ఆఖరుకు కాలిలో ముల్లు కూడా గుచ్చుకోకుండా ఉండేలా చూస్తాడు.”