*ఈ రోజు సత్య వాక్కు 🍃🌷విమర్శను స్వీకరించండి🌷🍃*
ఎండా-వానా, రాత్రి-పగలు మానవ జీవితానికెలా తోడుగా ఉంటాయో, నిందిచే వారు, దీవించే వారు ఈ జీవనయాత్రలో విడిపోని స్నేహితులు. విమర్శ మానవ జీవితంలో మొక్కకు వేర్లలో వేసిన ఎరువులా పనిచేస్తుంది. రకరకాల చెత్త, చెదారాలతో కలిసి తయారైన ఎరువును మొక్క సంతోషంతో స్వీకరిస్తుంది. ఎరువు దుర్వాసన వస్తోందని, దానికి బదులుగా సువాసన భరితమైన అత్తరును ఎరువుగా వాడితే కుసుమం వికసిస్తుందా. విమర్శ కూడా అలాంటిదే. మనిషి పరిపూర్ణ వికాసం పొందాలంటే విమర్శ అనే ఎరువు అనివార్యం. దీనిని భరించగలిగినప్పుడే జీవితంలో సద్గుణాలనే సుగంధపూరిత పుష్పాలు విరబూస్తాయి.
అనవసరమైన ప్రశంసలు మనిషిని ఇబ్బందుల్లో పడేస్తాయి. ఏదో పొందాలనే ఉద్దేశం, అల్పకాలిక సంతోషం కోసం, తన పని గడుపుకునేందుకు వచ్చే పొగడ్తలు చాలా ప్రమాదకరం. ఎవరైనా మిమ్మల్ని మంచివారని పొగిడితే ఎంతగానో ఆనందపడతారు. అయితే మనం మంచివారమని అంగీకరిస్తే.. మరింత మంచివారుగా తయారయ్యే మార్గాలన్నీ మూసుకుపోతాయి. ముఖస్తుతి, అసత్యమైన ప్రశంసలు అల్పకాలికమైనవే కాని ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి.
ఎవరైనా వచ్చి ప్రశంసల జల్లు కురిపిస్తే స్వీకరించకుండా ఎవరుంటారు. అయితే ఏ ఖర్చు లేకుండా వచ్చే ముఖస్తుతి వల్ల భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. మిమ్మల్ని పొగిడిన సదరు వ్యక్తిని సంతృప్తి పరిచేలా సౌకర్యాలు కల్పించాల్సి వస్తుంది. మీ దగ్గర ఉన్నాయని నమ్ముతున్న సద్గుణాలను, స్థితిని వారి ఎదుట ప్రదర్శించాల్సి వస్తుంది. నిజానికి ప్రశంసాపాత్రమైన యోగ్యత మీలో ఉన్నప్పుడు అది ప్రశంస అనిపించదు. ముఖస్తుతిని, ప్రశంసలను ఇష్టపడే వ్యక్తి యధార్థాన్ని స్వీకరించలేడు. తనలో లేనిదాని గురించి వినాలనుకుంటాడు. అసత్యంతో అలంకరించిన మాటలు సుఖాన్నిస్తాయనే భావనతో ఉంటాడు. ఈ ధోరణి మీలోని అహంకారానికి ఆజ్యం పోస్తుంది. మిమ్మల్ని సన్మార్గానికి దూరం చేస్తుంది.
తెలివైన వారు నిందించేవాళ్లను నిజమైన మిత్రులుగా భావిస్తారు. మీలోని సద్గుణాలను పొగిడేవారితో పాటు దోషాలను ఎత్తిచూపే వారితోనూ సాంగత్యం చేయండి. విమర్శకులు ఆత్మలో దాగి ఉన్న మురికిని తొలగించేందుకు ప్రయత్నిస్తారు. అందుకే వారు నిజమైన మిత్రులు. డాక్టర్లు గాయంలోని చీమును బలవంతంగా తొలగిస్తారు. ఒకసారి బాధ కలిగినా తరువాత హాయిగా ఉంటుంది. విమర్శ కూడా మనలోని లోపాన్ని తొలగించి సుఖాన్నిస్తుంది. నిజమైన ఆధ్యాత్మిక చికిత్స చేస్తుంది. కనుక విమర్శకు భయపడక దాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించండి.
🍃🌷🍃🌷🍃🌷🍃🌷

1 comments:
చాల చాల మంచి కథలు ఇవ్వన్ని కూడా సమాజానికి ఉపయోగపడతాయి