నేటి కథ - నేనేం చెయ్యాలి?

*నేటి కథ*

                        *నేనేం చెయ్యాలి?*

*ఆవులు కాసే రంగన్నకు ఉన్నట్టుండి ఓ సందేహం కలిగింది. "నేనేం చెయ్యాలి?" అని. ఇప్పుడు చేస్తున్న పని సరైనది కాదేమోనన్న అనుమానపు తాలూకు రూపమే ఆ సందేహం.*

*పక్కనే పచ్చగడ్డి మేస్తున్న ఆవును అడిగాడు రంగన్న "నేనేం చెయ్యాలి?" అని.*

*"బాగా తినాలి. మంచిగా పాలివ్వాలి. ఇంకా మంచిగా పేడ వెయ్యాలి కూడా" అని చెప్పింది ఆవు.*

*’ఊహూ, ఇది కాద’నుకున్నాడు రంగన్న. ’ఇది కాకపోతే మరి ఇంకేది?’ అని కూడా అనుకున్నాడు.*

*వెంటనే వెళ్లి ఓ పెద్ద చెట్టును అడిగాడు "నేనేం చేస్తే సరిపోతుందో చెప్పు?" అని.*

*"దొరికినప్పుడు దొరికినదాన్ని వీలయినంత బాగా వాడుకోవాలి. ఇంకా వీలయితే దాచుకోవాలి- జాగ్రత్తగా. దొరకనప్పటికి అక్కరకొస్తాది అది. దొరకనప్పుడు దాచుకున్నదాన్ని చక్కగా వాడుకోవాలి. అప్పుడు చింత లేకుండా ఉండొచ్చు. తీసుకోవాలి; ఇవ్వాలి. అలా మనకు మనం మేలుచేసుకోవాలి; ఇతరులకూ మేలు చేయాలి" చెప్పింది చెట్టు ఆలోచించుకుంటున్నట్లు.*

*"ఏమిటో ఈ చెట్టూ, చెట్టు మాటలూనూ! నాకేమీ అంతుపట్టడం లేదు. నేనేం చెయ్యాలో ఏమో!’ అనుకుంటూ వెళ్లి ఈ సారి గాలిని అడిగేశాడు రంగన్న. "నేనేం చెయ్యాలి?" అని.*

*"పొయ్యే వీలున్న అన్ని చోట్లకూ పోవాలి. అన్నింటినీ చూడాలి. అన్నింటినీ తాకాలి. చల్లగా! మెల్లగా! ఉల్లాసంగా! ఉత్సాహంగా!. రంగన్నా! ఓ రంగన్నా! వెళుతున్నా! నే వెళ్తున్నా!" అంటూ ముందుకు సాగిపోయిందా గాలి తెర.*

*గాలితెర మోసుకొచ్చిన పూల వాసన రంగన్నకు పూలచెట్లను గుర్తు చేసింది. వెంటనే పూలచెట్ల దగ్గరకు పోయాడు ఆయన.*

*తమపైని పూగుత్తులు పిల్ల గాలికి అటూ ఇటూ ఊగుతుంటే తమవంతుగా తామూ సంతోషంగా తలలూపుతున్నాయి పూల మొక్కలు. చూస్తుంటే అవన్నీ నిజంగా పూలను ఉయ్యాలలూపుతున్నట్లే ఉంది. రంగన్న రాకను గమనించి, పూలన్నీ తమ గుభాళింపు నవ్వులతో స్వాగతం చెప్పాయి అతనికి.*

*"పువ్వుల్లారా! పువ్వుల్లారా! మీరైనా చెప్పండి, నేనేం చేస్తే సరిపోతుందో?" అని అడిగాడు రంగన్న వాటిని.*

*"నవ్వు, రంగన్నా, నవ్వు! సంతోషంగా నవ్వు!! వచ్చే వాళ్లకు హాయ్! హాయ్!. పొయ్యే వాళ్ళకు బయ్ బయ్!! నవ్వు, రంగన్నా, నవ్వాలి! అదీ.. అలా నవ్వాలి!’ అని పువ్వులు గట్టిగా నవ్వాయి.*

*అవి అట్లా నవ్వుతుంటే, రంగన్నకు కూడా నవ్వు వచ్చింది. ఆ నవ్వు మోసుకొచ్చిన సంతోషంతో అతనిలోని సందేహాలన్నీ పటాపంచలయ్యాయి!*

*ఇక అతను సంతోషంగా నవ్వుకుంటూ ఆవులు కాసుకోవడానికి వెళ్ళిపోయాడు.*