నేటి కథ - చట్రంలో ఈగ

*నేటి కథ*

*చట్రంలో ఈగ*

*ఒక ఈగ పిల్ల ఎగురుతూ పోతూంటే దానికో సైకిల్ చక్రం కనిపించింది.*

*అన్ని చక్రాలూ నల్లగా, మురికిగా ఉంటే, ఈ చక్రం మాత్రం తెల్లగా మెరిసిపోతోంది. మూడు చక్రాల సైకిల్ దేమో, చిన్నగా ఉంది. మోటార్ సైకిల్ చక్రానికి మల్లే దాని లోపల ఐదు నీలం రంగు కడ్డీలు ఉన్నాయి. మొత్తం మీద చాలా తేలికగా ఉంది అది.*

*దాన్ని చూసేసరికి ఈగ పిల్లకు చాలా సంతోషం వేసింది.*

*"భలే! ఇక నేను ఎగరాల్సిన పని లేదు. దీని మీద కూర్చుని దొర్లించుకుంటూపోతే సరి!" అనుకుంది.*

*ఒక్కసారి ఎగిరి దాని టైరు మీద వాలిందోలేదో, ఆ చక్రం దొర్లటం మొదలెట్టింది. మరుక్షణంలో చక్రం పైనున్న ఈగ తలకిందులుగా చక్రం అడుక్కి వచ్చేసింది. ఇంకా కొంచెం ఆగి ఉంటే అది చక్రం కింద పడి నలిగిపోయేది! ఈగ వెంటనే పైకి ఎగిరి, మళ్ళీ చక్రం టైరు మీద వాలింది.*

*చక్రం దొర్లుకుంటూ పోతోంది. ఇప్పుడు దాని వేగమూ పెరుగుతోంది.*

*కళ్ళు మూసి తెరిచేంతలో ఈగ మళ్ళీ చక్రం కిందికి చేరుకున్నది తలకిందులుగా.*

*మళ్ళీ ఎగిరి పైకెక్కి కూర్చుంది టైరు మీద. ఊపిరి పీల్చేంతలో మళ్ళీ చక్రం అడుక్కి చేరుకున్నది.*

*చక్రం పోతూనే ఉన్నది. క్రింది ఈగ శ్రమ పడి పైకి ఎక్కి కూర్చుంటూనే ఉంది- ఊపిరి వదిలేంతలో అది మళ్ళీ చక్రం అడుక్కి చేరుకుంటోంది.*

*ఇక ఇది పని కాదనుకున్నది ఈగ.*

*ఈసారి ఎగిరినప్పుడు అది చక్రం కడ్డీ మీద వాలింది.*

*ముందుగా అది ఆ కడ్డీ పై వైపుకి పోయింది. అంతలోనే ఆ కడ్డీ నిటారుగా అయిపోయింది! కిందికి జారిపోకుండా ఈగ దాన్ని గట్టిగా పట్టుకున్నది. మరుక్షణంలోనే ఈగ తలకిందులైంది! అయినా దానికి కడ్డీని వదిలేంత ధైర్యం లేకపోయింది. అంతలో అది తల కిందులుగానే నిటారుగా అయ్యింది! ఏం జరుగుతోందో అర్థమయ్యేలోపల మళ్ళీ మామూలుగా అయిపోయింది.*

*చక్రం ఇంకా వేగంగా పోవటం మొదలుపెట్టింది. ఈగ మాటిమాటికీ నిలువుగా, అడ్డంగా, ఏటవాలుగా అవుతున్నది.*

*దానికి మొదట్లో సంతోషం అనిపించింది: ‘ పిల్లలు రంగుల రాట్నంలో ఇలాగే కదా, తిరుగుతారు?’ అనుకుందది. కానీ అంతలోనే దానికి కళ్ళు తిరగటం మొదలైంది. కడుపంతా ఏదోలా వికారంగా అవుతున్నది.*

*మెల్లగా అది కడ్డీ లోపలి అంచు వైపుకి జరిగింది-చక్రం కేంద్రం వైపుకు. ఇప్పుడు ఇంకా తొందరగా అది చుట్టూ తిరుగుతున్నది.*

*బాగాలేదని అది చక్రంలోంచి బయటకు దూకింది, గడ్డిమీదకు. చక్రం ముందుకు పోతూనే ఉంది.*

*ఈగ గడ్డిమీద నిలబడి, ముందుకు దొర్లుకుంటూ పోతూన్న చక్రం వైపే ఇష్టంగా చూసింది. అప్పుడు దానికో సంగతి అర్థమైంది.*

*దాని వెనక ఎగురుకుంటూ పోయింది. ఆ చక్రం ఇరుసుమీద వాలింది.*

*ఇప్పుడది గుండ్రగా తిరగటం లేదు.*

*రాజా మాదిరి ముందుకే పోతున్నది - సుఖంగా, ఉల్లాసంగా ఉన్నది.*

*తన తెలివిని చూసుకొని ఈగ పిల్ల చిరునవ్వు నవ్వింది.*

*చక్రం గుండ్రంగా తిరిగినా ఇరుసు మాత్రం తిరగదని దానికి తెలిసిపోయింది!*